- ఒకరికి తీవ్రగాయాలు
- కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై మరోసారి గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. తొర్రూరు మండలంలోని నాంచారిమడూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్ట్ వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న లక్ష్మీ అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగా, వారి అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు చెబుతున్నారు. లారీని ఆపలేక డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. స్థలానికి తొర్రూరు పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, వాహనాలను పోలీసులు మళ్లించారు. ఇటీవలి కాలంలో అదే జాతీయ రహదారిపై గ్రానైట్ లారీల ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పెద్ద వాహనాలు అధిక వేగంతో నడిపించడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


