మహాశివరాత్రి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
కాకతీయ, ఖిలా వరంగల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖిలా వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. మంగళవారం దేవాలయ చైర్మన్ బంగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బంగారి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో శివ–పార్వతుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో ఆలయాభివృద్ధి కోసం రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో దేవాలయం చుట్టూ గ్రానైట్ పనులు, ప్రహరీ గోడ నిర్మాణం, చలువ పందిళ్ల ఏర్పాటు, బారికేడ్లు, భక్తులకు తాగునీటి సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. అలాగే ఖుషుమాల్ సమీపంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి శంబులింగం, ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బెడదా వీరన్న, డివిజన్ అధ్యక్షుడు బోయిని దూడయ్య, ఏసిరెడ్డి రఘు, గిరి తదితరులు పాల్గొన్నారు.


