గ్రామ సభలు విజయవంతం చేయాలి
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
కాకతీయ, కొత్తగూడెం : గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని చెప్పారు. ప్రతి శాఖ తమకు సంబంధించిన పథకాలపై నివేదికలు సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని సూచించారు. సభలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షామియానాలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని చెప్పారు. విద్యాశాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ రైతులకు లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


