- మిల్లర్లకు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి
- 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ధాన్యం సేకరణపై మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు కేంద్రాల్లో సరియైన తూకం, తేమ శాతం, రవాణా, నిల్వ వంటి అంశాలలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లర్లు ధాన్యాన్ని సమయానికి దిగుమతి చేసుకోవాలని సూచించారు. లారీ ట్రాన్స్‌పోర్టర్లు సకాలంలో రవాణా ఏర్పాట్లు చేసి, రైతుల ధాన్యం ఎక్కడా ఆగకుండా చూడాలన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా అందుకు గాను 266 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ లో ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు సెంటర్లను గతంలో కంటే 65 ఎక్కువ పెంచడం జరిగిందని, ఇందుకు గాను లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు కూడా ధాన్యం రవాణాకు వాహనాలు పెంచాలన్నారు. మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి అని, మిల్లింగ్ కెపాసిటీ ప్రకారం బ్యాంకు గ్యారంటీ చెల్లించాలని కలెక్టర్ చెప్పారు.
ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ సమస్యలు రాకుండా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఎంఓ సురేఖను ఆదేశించారు. రవాణా, బార్దాను సమస్య రాకుండా చూడాలని డీఎంను, రైస్ మిల్లర్ల ట్యాగింగ్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని డీసీఎస్ఓను ఆదేశించారు. ట్రక్ షీట్ లేని వాటిని లోడింగ్ చేయకూడదని, ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ది చేసిన ధాన్యాన్ని సెంటర్లోకి వచ్చేలా చూడాలని డీసీఓ నీరజ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జడ్పీ సీఈఓ ఇంచార్జ్, డీఆర్‌డీఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనెల రవీందర్, కార్యదర్శి సత్యనారాయణ, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.


