- కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
కాకతీయ,మహబూబాబాద్ ప్రతినిధి : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరం చేయాలని మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామాక్రిష్ణరావులు హైద్రాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, డీఆర్డీవో పిడి మధుసూదనరాజు, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరా శాఖ అధికారి ప్రేమ్ కుమార్, డీఎం సివిల్ సప్లై క్రిష్ణవేణి, వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ విజయ, గిరిజన కార్పొరేషన్ అధికారి దేవ్, ఆర్టీవో జైపాల్ రెడ్డి, ఎల్డిఎం యాదగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో కలెక్టర్ సమీక్ష..
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఐకేపీ 59, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ద్వారా 168, గిరిజన కార్పొరేషన్ 13, మెప్మా 2, మొత్తం కలిపి (242) ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.


