ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి
వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష
కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రవాణా, వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష చేపట్టారు.
ధాన్యం మిల్లులకు వెంటనే తరలించాలి
కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని, ఇందుకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాతావరణంలో మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, సంబంధిత సిబ్బంది అంతా ఫీల్డ్‌లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
వసతి గృహాలపై నిత్య తనిఖీలు జరగాలి
ప్రస్తుత శీతాకాల పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని వసతి గృహాలను ప్రత్యేక అధికారులు, హాస్టల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు నిత్యం తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, వారికి సరిపడా దుప్పట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. వసతి గృహాల్లో డైట్ మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన వేడి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఏడీ ఎస్ఎల్ఆర్ నరసింహ మూర్తి, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, డీఎస్ఓ రమేష్‌తో పాటు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. అలాగే అన్ని మండల కేంద్రాల నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఎంపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.


