- రైతుల వివరాలు, నాణ్యత తూకం సరిగ్గా చూసుకోవాలి
- కౌలు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి
- 670 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
- నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణలో భాగంగా మంగళవారం పెగడపల్లి, సాలంపాడ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. సేకరించిన ధాన్య నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్య వివరాలు అడిగి, కేంద్రాల్లో ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షణ నిర్వహించారు. కేంద్రాల వద్ద అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా కౌలు రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యపై కేంద్ర నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం, క్రాప్ బుకింగ్ డేటాలో పొరపాట్లు ఉంటే సరిచేయడం, కౌలు రైతుల ధాన్యం ధృవీకరణ పొందడం లాంటివి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో తక్షణం పరిశీలించాలన్నారు.
ధాన్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తూకం వేయించడానికి కేంద్రాలకు తక్షణమే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని ట్రక్ షీట్లు సమయానికి అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సీజన్లో 670 కేంద్రాలు ఏర్పాటు చేశారని, అవసరమైతే అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, తహసీల్దార్ విఠల్, ఏ.ఓ సంతోష్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


