గౌడ సర్పంచ్‌లు ఆదర్శ పాలన చూపాలి
గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి అవసరం
పార్టీలకతీతంగా ముందుకు సాగాలి
గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్ గౌడ్
తొర్రూరులో నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం
కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సర్పంచ్‌లు ఆదర్శవంతమైన పాలన అందించి మిగతా వారందరికీ స్ఫూర్తిగా నిలవాలని గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గోపా జిల్లా శాఖ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ సౌజన్యంతో స్థానిక వికాస్ హైస్కూల్ నూతన భవనంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైన 15 మంది గౌడ సర్పంచ్‌లను ఒకే వేదికపైకి ఆహ్వానించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
సేవా కార్యక్రమాలతో ముందంజలో గోపా
ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ… జిల్లా గోపా ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొర్రూరులో గౌడ సహకార పరపతి సంఘం, కౌండిన్య సహకార పరపతి సంఘం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్, కంఠమహేశ్వర సహకార పరపతి సంఘాల సమన్వయంతో పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది ప్రతిభా పురస్కారాలు అందించడం, పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తాడిచెట్లపై నుంచి పడి గాయపడిన కుటుంబాలకు సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
సర్పంచ్ పదవి అత్యంత కీలకం
తొర్రూరు డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ మాట్లాడుతూ… గౌడలంతా తమ మూలాలను మరవకుండా పరస్పరం సహకరించుకుంటూ పార్టీలకతీతంగా ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరు పాపన్న సైనికుడిలా పనిచేస్తే ఆయన ఆశయాలను నెరవేర్చగలమన్నారు. జనగాం జిల్లా అధ్యక్షులు మేకపోతుల ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ దేశానికి ప్రధాని, రాష్ట్రానికి సీఎం ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ పదవিও అంతే కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు, జిల్లా, డివిజన్ నాయకులు, వివిధ సహకార సంఘాల అధ్యక్షులు, గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


