అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం
భక్తులకు అసౌకర్యంగా మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు
పూర్తిస్థాయిలో అమలు కాని జాతర పనులు
బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్
కాకతీయ, ఆత్మకూరు : అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో చేపట్టాల్సిన పనులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. వరంగల్ జిల్లాలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు ఈ జాతరకు తరలివస్తారని గుర్తుచేశారు. అలాంటి జాతరలో ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, పారిశుధ్య ఏర్పాట్లు తక్షణమే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతర నిర్వహణను కేవలం నామమాత్రంగా కాకుండా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని సూచించారు.
జాతరకు గౌరవం ఇవ్వాలి
అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరకు ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించి, తగిన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని బీజేపీ నేతలు కోరారు. మౌలిక వసతుల లోపాలతో జాతర ప్రతిష్ఠ దెబ్బతినకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గట్టు వేణు గౌడ్, చౌల్లపల్లి సర్పంచ్ మోరే రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ గుల్లపెల్లి వెంకన్న, మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, బలవంతుల రాజు, మండల ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వేములపల్లి శ్రీలత, బీజేవైఎం మండల అధ్యక్షుడు పోరెడ్డి ప్రదీప్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


