కాకతీయ, రేగొండ: రైతుల సమస్యలను పట్టించుకోని చేతకాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి డిమాండ్ చేశారు. రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. ఒక వైపు రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూపాలపల్లి నియోజకవర్గం అంతటా యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతు సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా చర్చ జరగాల్సి ఉన్నా, రాజకీయ ప్రయోజనాలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే యూరియా ఎరువును రైతులకు అందించాలని గండ్ర డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


