దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అండ
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజలు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల చదువు, ఉపాధి, జీవనోపాధి కోసం ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తోందని తెలిపారు. వారి సంక్షేమానికి రూ.50 కోట్లు కేటాయించామని, బధిరుల ఆశ్రమ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సైన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులను నియమించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం దివ్యాంగులకు కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు పాసుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే దివ్యాంగుల దినోత్సవం కల్లా ప్రధాన సమస్యలను తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో ‘దివ్య దృష్టి’ యూట్యూబ్ ఛానల్‌ను ఆవిష్కరించారు. దివ్యాంగుల పాడిన పాటను ముఖ్యమంత్రి ఆవిష్కరించిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు.ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, దివ్యాంగుల కోఆపరేటివ్ చైర్మన్ వీరయ్య, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం అతిథులను సన్మానించగా దివ్యాంగుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, వైద్య సేవలు,విద్యాభాధ్యతలను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి హామీ ఇచ్చారు.


