కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించాలనీ TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
దాదాపు 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం , సమస్యల పరిష్కారం కోసం , సంక్షేమం కోసం, వారి ఐక్యత కోసం TPTF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం కొనసాగుతదనీ, అందుకు మీ అందరి భాగస్వామ్యం కూడా చాలా అవసరమనీ , మీరు ఛైతన్యమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
రాష్ట్రంలో దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులకు 3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. వారి అర్హతకు తగిన జీతం లేదు, సమయానికి జీతాలు రావు. ప్రభుత్వ సెలవులు ఉండవు, ప్రభుత్వ సమయ వేళలు ఉండవు. 12 నెలల జీతం ఉండదు, ESI, PF వంటి సౌకర్యాలు ఉండవు. ఇన్ని సమస్యలతో చెలగాటం ఆడుతూ మరోపక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులు.
పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ ఉపాధ్యాయుల శిక్షణలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించడం మన కృషికి నిదర్శనం. మరి ఇంత కష్టపడుతున్న ఉపాధ్యాయులను ఎవరు గుర్తిస్తున్నరు? ఎవరు గౌరవిస్తున్నరు? ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సెప్టెంబర్ 5 న జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారిని ఎందుకు గుర్తించి సత్కరించడం లేదు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనీ, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలతో సత్కరించాలనీ కోరారు. ఈ సమావేశంలో గీసుగొండ మండల అధ్యక్షుడు దామెర సూర్యచంద్ర, సంగెం మండల అధ్యక్షుడు ఎల్కుర్తి రవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్, జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాకూబ్ పాషా, గీసుగొండ మండల ఉపాధ్యక్షులు అశోక్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


