ప్రభుత్వ పథకాలు
అర్హులందరికీ చేరాలి
సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
దిశ సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ
కాకతీయ, వరంగల్ బ్యూరో: హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని పర్యవేక్షించేందుకు దిశ కమిటీ ఎంతో కీలకమని తెలిపారు. 2016 జూలైలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ, అప్పటి వరకు ఉన్న డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ స్థానంలో ఏర్పాటైందని వివరించారు.

కేంద్ర పథకాల అమలుపై సమీక్ష
గత త్రైమాసికంలో తీసుకున్న నిర్ణయాలపై పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో అమలు అవుతున్న 43కుపైగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం ఉజ్వల యోజన, అమృత్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు, పీఎం ముద్రా యోజన వంటి కీలక పథకాల అమలుపై అధికారులు నివేదికలు సమర్పించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం పెరిగితే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. పథకాల అమలులో అవినీతికి తావులేకుండా మినిమమ్ గవర్నమెంట్, మాక్సిమమ్ గవర్నెన్స్ సూత్రంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరారు.
ప్రజా సమస్యలపై చర్చ..
జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఉపాధి హామీ పనుల వేగవంతం, పేదలకు గృహ నిర్మాణ పథకాల అమలు, శుభ్రత కార్యక్రమాల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. రేషన్, పెన్షన్లు, విద్య, వైద్య సేవలు ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ కడియం కావ్యతో కలిసి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే హనుమకొండ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం కేటాయించిన ప్రతి రూపాయి సరైన విధంగా వినియోగించబడాలని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనం అందించడమే దిశ కమిటీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, హనుమకొండ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


