మేడారం జాతరకు శుభారంభం!
ఘనంగా మండే–మెలిగే పండుగ
సమ్మక్క–సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
గ్రామమంతా పండుగ కళ… ప్రతి ఇంటా సందడి
మహాజాతరకు వారం ముందే ఆధ్యాత్మిక ఉత్సవం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందు జరిగే ‘మండే–మెలిగే’ పండుగ బుధవారం మేడారంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పండుగతోనే మహాజాతర శుభారంభమైందని భక్తులు భావిస్తారు. జాతరకు వారం రోజుల ముందే జరిగే ఈ ఉత్సవాన్ని ‘గుడి మెలిగే పండుగ’గా కూడా పిలుస్తారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతర నేపథ్యంలో మేడారం గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. తెల్లవారుజామునే పూజారులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల ప్రాంగణాల్లో అలుకు పూతలు చేసి, రంగురంగుల ముగ్గులతో వీధులు, గుడులను సుందరంగా అలంకరించారు. గంటలు, వస్త్రాలు, ఉతకొమ్ములు, మువ్వలు తదితర పూజా సామగ్రిని శుద్ధి చేసి పండుగకు సిద్ధం చేశారు. కన్నెపల్లిలో సమ్మక్క గుడి వద్ద, మేడారంలో సారలమ్మ గుడిలో మండే–మెలిగే పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.


పల్లెదేవతలకు ప్రత్యేక పూజలు
డోలి వాయిద్యాల మధ్య గ్రామ దేవతలైన బొడ్రాయి, మైసమ్మ, పోచమ్మలకు పూజలు చేశారు. గ్రామంలోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గ్రామ పొలిమేరల్లో భూరుక కర్రలకు మామిడాకుల తోరణాలు కట్టి, సొరకాయలు, ఎండు మిరపకాయలు, కోడి పిల్లలను కట్టే సంప్రదాయాన్ని పూజారులు ఆచరించారు. ఈ ఆచారాలు గ్రామాన్ని అపాయాల నుంచి కాపాడతాయన్న నమ్మకం ఆదివాసీలలో ఉంది. అనంతరం పూజారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాజాతర ముగిసే వరకు ప్రధాన పూజారులు అత్యంత నిష్ఠతో పూజా కార్యక్రమాలు కొనసాగించనున్నారు.

గద్దెల వద్ద రహస్య పూజలు
రాత్రివేళ మేడారం గద్దెల వద్ద తల్లుల సన్నిధిలో పూజారులు రహస్య పూజలు చేశారు. గద్దెల చుట్టూ అలికి, ముగ్గులు వేసి, పసుపు–కుంకుమలతో దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ జాగారం చేశారు. ఒకరికి ఒకరు శక్తిని పంచుకుంటూ అక్కడే రాత్రంతా గడిపారు. తెల్లవారుజామున మళ్లీ ఆలయాలకు చేరుకుని పూజా సామగ్రిని గుడుల్లో ఉంచి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే బుధవారం నుంచి మహాజాతర ప్రారంభమై శనివారం వరకు కొనసాగనుంది. జాతర ముగిసిన తర్వాత తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఇప్పటికే భక్తుల రాక మొదలవడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. మండే–మెలిగే పండుగతో మేడారం మహాజాతరకు ప్రత్యేక శోభ సంతరించుకుంది.



