చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు
కాకతీయ,హుజూరాబాద్: హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం హెల్ప్ (హార్ట్‌ఫుల్‌నెస్ అనుభవం – జీవిత సామర్థ్యం) ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.హెల్ప్ కార్యక్రమం ప్రాంతీయ సమన్వయకర్త వెంకటరమణ, హుజూరాబాద్ పరిసరాల సమన్వయకర్త శ్రీనివాస్ విద్యార్థులతో మాట్లాడారు. రోజువారీ జీవితంలో ఆహారపదార్థాలు, కూరగాయలు ఏ విధంగా కలుషితమవుతున్నాయి, విద్యార్థులు ఈ వేగవంతమైన జీవితంలో ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారనే అంశాలను వారు వివరించారు.ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు శరీరం ఎదుర్కోనే శ్రమ, ఒత్తిడి ప్రభావాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని, ప్రతిరోజూ కనీసం ఒక గంటపాటు ధ్యానం, యోగా, శారీరక వ్యాయామాలు చేస్తే మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశ అభివృద్ధికి పునాది అవుతారని పేర్కొన్నారు.ఇంచార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ.దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు, ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కూడా అత్యంత ముఖ్యమని తెలిపారు. మంచి ఆహారపద్ధతులు, ఆరోగ్య నియమాలు చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని విద్యార్థులను కోరారు.ప్రతిరోజూ విద్యార్థులకు యోగా, ధ్యానం నిర్వహించేందుకు కళాశాల విద్యార్థి మార్గదర్శకుడు రాజేశానికి బాధ్యత అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.కార్యక్రమంలో అధ్యాపకులు సుగుణ, శైలజ, జ్యోతి, విజేందర్ రెడ్డి, వాసుదేవరావు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


