కాకతీయ, బిజినెస్ డెస్క్: మహిళలకు గుడ్ న్యూస్. భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై స్పష్టత కోసం పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో, ధరలు గణనీయంగా తగ్గిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,300 పడిపోయి తులం ధర రూ.1,13,800కు చేరగా, 22 క్యారెట్ల బంగారం కూడా అదే స్థాయిలో తగ్గి రూ.1,13,300గా నమోదైంది.
బంగారం మాత్రమే కాకుండా వెండి ధరల్లోనూ కోతలు చోటుచేసుకున్నాయి. బుధవారం వెండి ధర కిలోకు రూ.1,670 తగ్గి రూ.1,31,200కు పడిపోయింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, గత సెషన్‌లోనే వెండి రూ.570 పెరిగి రూ.1,32,870 చేరి కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఒకవైపు పెరుగుతూ వచ్చిన ధరలు ఇలా ఒక్కసారిగా వెనక్కి తగ్గడం పెట్టుబడిదారుల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు దాదాపు 1 శాతం పడిపోయి $3,664.82 వద్దకు చేరగా, వెండి ధరలు మూడు శాతం పడిపోయి ఔన్సుకు $41.38 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై ఉన్న అనిశ్చితి కారణంగానే ధరలు ఒత్తిడికి గురయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో కూడా ధరలు తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,11,710గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,02,400 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర మాత్రం కిలోకు రూ.1.42 లక్షల వద్ద కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం, వెండి రేట్లు ఇలా ఒక్కసారిగా తగ్గిపోవడం వినియోగదారులకు ఉపశమనం కలిగించిందనిపిస్తున్నా, పెట్టుబడిదారులను కొంత ఆందోళనకు గురిచేసింది.


