కాకతీయ, బిజినెస్ డెస్క్: ఇటీవల వరుసగా రికార్డులు సృష్టించిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ఎగిసిపడుతూ కొత్త గరిష్టాలను తాకింది. అయితే తాజాగా వరుసగా రెండో రోజు ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.600 పడిపోగా, ప్రస్తుతం అది రూ.1,13,200గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.500 తగ్గి రూ.1,12,800గా ఉంది. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం అమెరికా ఫెడ్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ రేట్ల నిర్ణయమే.
తొమ్మిది నెలల విరామం తర్వాత ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒత్తిడికి గురై పతనమయ్యాయి. వ్యాపారుల అభిప్రాయం ప్రకారం వడ్డీ రేట్లు తగ్గడంతో డిమాండ్ తగ్గి, బంగారం ధరలపై నేరుగా ప్రభావం పడింది. ఈ ఏడాది చివరి నాటికి మరికొన్ని సార్లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.ప్రపంచ మార్కెట్లో కూడా పసిడి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.23 శాతం పెరిగి 3,668.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి కూడా స్వల్ప పెరుగుదలతో 0.55 శాతం లాభపడి ఔన్సుకు 41.90 డాలర్ల వద్ద నిలిచింది.
స్థానికంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,11,170గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,900కి పడిపోయింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉండి కిలోకు రూ.1.41 లక్షల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించగా, దేశీయంగా కూడా బంగారం ధరలు కొంత తగ్గాయి. ఇది కొనుగోలుదారులకు తాత్కాలిక ఊరట కలిగించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల మార్పులు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి పసిడి ధరలు మళ్లీ పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్నది చూడాలి.


