కిసాన్ గ్రామీణ మేళాలో ‘గోల్డ్ మ్యాన్’
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజీమోన్ మీతల్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళాలో ‘గోల్డ్ మ్యాన్’గా పేరొందిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒంటిపై ఏకంగా రెండున్నర కేజీల బంగారు ఆభరణాలు ధరించి మేళాకు హాజరైన ఆయనను చూసి సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కర్ణాటకకు చెందిన రెడ్ ల్యాండ్ అస్లైన్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ రాజీమోన్ మీతల్ ఈ మేళాలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. మెడలో సుమారు కేజీ బంగారు గొలుసు, రెండు చేతులకు కలిపి కేజీన్నర బంగారు ఆభరణాలు ధరించి తలుక్కుమంటూ మెరిశారు. మేళాలో ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ నడిచింది. బంగారం కేవలం మహిళలకే కాదు, పురుషులకూ అందాన్ని ఇస్తుందని నిరూపించేందుకే ఈ విధంగా బంగారు ఆభరణాలు ధరిస్తున్నానని రాజీమోన్ మీతల్ తెలిపారు. నేటి పరిస్థితుల్లో బంగారం ధరించి బయటికి వెళ్లడమే భయంగా మారినా తనకు మాత్రం ఎలాంటి భయం లేదన్నారు. భవిష్యత్తులో ఐదు కేజీల బంగారం ధరించడమే తన లక్ష్యమని ఆయన చెప్పడం మేళాకు వచ్చిన వారిలో మరింత ఆసక్తిని రేపింది. ‘గోల్డ్ మ్యాన్’గా రాజీమోన్ మీతల్ దర్శనమివ్వడం కిసాన్ గ్రామీణ మేళాకు ప్రత్యేక హంగును తీసుకొచ్చిందని పలువురు సందర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


