వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం
కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొండ అర్జున్ ఈ వేడుకలో పాల్గొని స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తె మట్టెలను భక్తిశ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం కన్నుల పండువగా సాగింది. ఈ శుభ సందర్భాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

దైవాశీస్సులతో గ్రామాభివృద్ధి
కళ్యాణ అనంతరం సర్పంచ్ కొండ అర్జున్ మాట్లాడుతూ.. ముక్కోటి దేవతల ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధికి దైవాశీస్సులతో పాటు ప్రజల సమిష్టి సహకారం అవసరమని పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.


