వనంలో వైభవం..
మేడారం మొదటి రోజు ఉత్సవం!
సారలమ్మ గద్దెపైకి రానున్న కీలక ఘట్టం
పూనకాలతో హోరెత్తిన అడవి ప్రాంతం
లక్షలాది భక్తులతో జనసంద్రంగా మేడారం
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర మొదటి రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. జనవరి 28న అధికారికంగా ఆరంభమైన జాతరతో ములుగు జిల్లా అరణ్య ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టగా, అడవీ ప్రాంతం మొత్తం జనసంద్రాన్ని తలపిస్తోంది. జాతరలో తొలిరోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ (సారక్క) తల్లిని గిరిజన పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో మేడారం గద్దెపైకి తీసుకువచ్చే కీలక ఘట్టం జరగనుంది. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. అమ్మవారి ఆగమనంతో జాతర వాతావరణం మరింత ఉత్సాహంగా మారనుంది.





పూనకాలతో హోరెత్తిన మేడారం
అమ్మవార్ల రాకను పురస్కరించుకుని మేడారం వనం పూనకాలతో హోరెత్తుతోంది. భక్తులు శివాలూగుతూ, డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. అడవంతా భక్తి గీతాలతో మార్మోగుతోంది. ఇప్పటికే సమ్మక్క భర్త పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి, గోవిందరాజులు కొండాయి నుంచి మేడారం చేరుకున్నారు. ఈ దేవతలందరినీ తొలిరోజే గద్దెలపై ప్రతిష్ఠించనుండటం విశేషం. ఈ ఘట్టంతో మేడారం మహాజాతర పూర్తిస్థాయిలో ఉత్సవ శోభను సంతరించుకుంది. మేడారం పరిసరాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. తమ బరువుకు సమానమైన బెల్లాన్ని (బంగారం) వనదేవతలకు సమర్పిస్తూ భక్తులు పునీతులవుతున్నారు. జాతరకు సుమారు కోటి నుంచి కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతర తొలి రోజు భక్తి, ఉత్సాహం, సంప్రదాయాల సమ్మేళనంగా సాగుతోంది. రేపు చిలకలగుట్ట నుంచి ప్రధాన దేవత సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండటంతో జాతర మరింత వైభవంగా కొనసాగనుంది.















