మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు
రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం
హుండీని బహూకరించిన భక్తులు
కాకతీయ, కాజీపేట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం, అభిషేకం కల్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. సత్యనారాయణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం ఆనందకరమన్నారు. వరంగల్ మహా నగరంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మెట్టుగుట్టపై గల శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవస్థానాల్లో గురువారం ఉదయం రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. రామాలయంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుందూరు రాజగోపాల్ రెడ్డి, కవిత, శివాని రెడ్డి సుమారు రూ.55 వేల విలువ గల హుండీ సమర్పించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణ శర్మ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


