కాకతీయ, బోథ్ : కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరి ఆమోదం పొందిన వ్యక్తికే డీసీసీ అధ్యక్షుడిగా పదవిని కేటాయిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎన్నికల నియామక ప్రక్రియకు సంబంధించి బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ పట్టణంలో పార్టీ కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని, వచ్చిన పేర్లకు సంబంధించి వివిధ కోణాల్లో పరిశీలించి, పార్టీ అధిష్ఠానానికి కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలను అందజేస్తామన్నారు.
కార్యక్రమంలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ సమన్వయకర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాం భూపాల్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక న్యాయాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ పదవులలో యువకులకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2022 ఉదయ్ పూర్ నవసంకల్ప్ శిభీర్ ప్రతిపాదనకు అనుగుణంగా 50 ఏళ్ల లోపు ఉన్న నాయకులకు పార్టీ పదవుల్లో 50% పదవులు కేటాయించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, అలాగే పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి దరఖాస్తు చేశారు.


