గిరివాణికి ఫిర్యాదుల వెల్లువ
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర
కాకతీయ, ఏటూరునాగారం : గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన గిరివాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ ఏటూరునాగారం సమావేశ మందిరంలో ప్రజావాణి–గిరివాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గిరివాణికి 130, ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రోడ్లు, బోర్వెల్లు, వ్యవసాయ అవసరాలపై గిరిజనులు ఎక్కువగా అర్జీలు సమర్పించారని తెలిపారు. భూ సమస్యలు, ఎల్టిఆర్ కేసులపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఎస్ డి సి కోర్టును వారంలో నాలుగు రోజులు నిర్వహిస్తామని చెప్పారు. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కోర్టు పనిచేస్తుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం ఉపాధి హామీ నిధులు వినియోగిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఏ పి ఓ వసంత రావు, ఆర్డీఓ వెంకటేష్, ఎస్ డి సి ప్రతాప్, డి డి జనార్దన్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపి డి ఓ లు పాల్గొన్నారు.


