ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి
పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్
రూ.35 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
కాకతీయ, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఆడిట్ అధికారి ఏసీబీకి చిక్కాడు. పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఆ అధికారి రూ.35 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీకి చెందిన ఆడిట్ అధికారి సంతోష్ ఒక రిటైర్డ్ ఉద్యోగి పింఛన్ ప్రాసెస్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడు. పింఛన్ ఫైల్‌ను ముందుకు పంపాలంటే రూ.40 వేలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో దాడి చేశారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో రూ.35 వేల లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం అధికారి వద్ద నుంచి డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కలకలం రేగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.


