భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా గాజర్ల
బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై టీపీసీసీ దృష్టి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమిస్తూ పార్టీ బలపరిచే దిశగా చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో 119-భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్‌గా గాజర్ల అశోక్ ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. గాజర్ల అశోక్ గతంలో టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేయడంతో పాటు, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. మేడ్చల్ జిల్లా డీసీసీ కమిటీల ఇన్చార్జ్గా, డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం ఆయనకు భద్రాచలం నియోజకవర్గంలో బూత్ లెవల్ ఆఫీసర్ల నియామక బాధ్యతలను అప్పగించడం పార్టీ ఆయనపై ఉంచిన నమ్మకాన్ని సూచిస్తుంది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్ట్ నేత అయిన గాజర్ల అశోక్ గత సాదారణ ఎన్నికల ముందు పరకాల టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు, అనంతరం పార్టీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడంతో, రాష్ట్ర స్థాయిలో పార్టీ చేపట్టే అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ నియామకం ద్వారా భద్రాచలం నియోజకవర్గంలో బూత్ స్థాయి వ్యవస్థ మరింత బలపడడంతో పాటు, రాబోయే ఎన్నికల దిశగా పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.


