మిస్సింగ్ కేసుల చేదనలో గీసుగొండ పోలీసులు ముందంజ
కాకతీయ, గీసుగొండ: ఈ ఏడాది గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన 27 మిస్సింగ్ కేసుల్లో 26 కేసులను విజయవంతంగా చేధించామని గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపారు.సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సీఐ మాట్లాడుతూ…ప్రజల భద్రతను ముఖ్యంగా పరిగణించి ప్రతి కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేపట్టినట్లు చెప్పారు.మహిళలు, పురుషులు, బాలబాలికలు కలిపి మొత్తం 27 మిస్సింగ్ కేసులు నమోదు కాగా,కుటుంబ విభేదాలు, వ్యక్తిగత ఒత్తిడులు,ప్రేమ సంబంధాలు వంటి కారణాల వల్లే ఎక్కువ కేసులు చోటుచేసుకు న్నాయని ఆయన వివరించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా విశ్లేషణ, టెక్నికల్ సహకారం,రాత్రి పహారాలు, ప్రత్యేక బృందాల పర్యవేక్షణతో విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం ఒక్క బాలుడు మిస్సింగ్ కేసు మాత్రమే పెండింగ్‌లో ఉందని, ఆ బాలుడు వెస్ట్ బెంగాల్‌కు చెందినవాడై ఉండటంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సీఐడి విశ్వేశ్వర్ తెలిపారు. ఈ కేసును కూడా త్వరలోనే చేధిస్తామన్నారు.మిస్సింగ్ కేసులు కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తాయని,ఎవరైనా కనిపించకపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,అనుమా నాస్పద విషయాలు గమనిస్తే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం గీసుగొండ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని విశ్వేశ్వర్ స్పష్టం చేశారు.


