గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి
ములుగు కలెక్టర్ దివాకర
కాకతీయ, ఏటూరునాగారం: గ్యాస్ సిలిండర్ల బుకింగ్, వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్‌ల మధ్య కనీసం 45 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గడువు పూర్తికాకముందు బుకింగ్ చేస్తే ఓటిపి రాదని, వినియోగదారులు అనవసరంగా ఏజెన్సీల వద్దకు రావద్దని సూచించారు. బుక్ చేసిన వారికి నిర్ణీత సమయంలోనే ఇంటి వద్దకు సిలిండర్లు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఓటిపి వచ్చిన వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి సరఫరా చేయాలని, ఓటిపి రాని వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 8 ఏజెన్సీల పరిధిలో 86,896 గృహ కనెక్షన్లు, 254 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రోజుకు సుమారు 942 సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు వీడి నిబంధనల ప్రకారం మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ బుకింగ్‌పై అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, కేజీబీవీలు, గురుకులాలు, పాఠశాలల్లో సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎం సివిల్ సప్లయ్ క్రిష్ణ వేణి, డీటీ విజయ్ కుమార్, సర్పంచ్ కాకుల మర్రి శ్రీలత, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.


