దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్..
జురేల్‌కు సపోర్ట్!
కాకతీయ, స్పోర్ట్స్ : టీమిండియా నవంబర్ 14న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడనుంది. రెండు జట్లు కూడా రెడ్‌బాల్ ఫార్మాట్‌లో తుది సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ సిరీస్‌లో అత్యధిక చర్చ జరుగుతున్న విషయం.. వికెట్ కీపర్ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నదే. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తుండగా, అద్భుత ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్ ధ్రువ్ జురేల్ కూడా సెలక్షన్ రేస్‌లో నిలిచాడు.
మామూలుగా వికట్‌కీపర్ రిషబ్ పంత్ కు బ్యాకప్ కు జురేల్ ను ఎంపిక చేస్తారు. కానీ ఈ మధ్యే వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో జురేల్ సెంచరీ సాధించాడు. తాజాగా దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో ముగిసిన అనధికారిక టెస్ట్‌లోనూ 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెడ్బాల్ క్రికెట్‌లో అతని రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది. దీంతో సెలెక్టర్ల కన్‌ఫ్యూజ్‌లో పడ్డారు. అయితే మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రిషబ్ తిరిగి వచ్చాడు, జురేల్ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ దశలో ఇద్దరికీ అవకాశమివ్వడం కష్టమే కానీ, యువ ఆటగాడి ఫామ్‌ని దృష్టిలో ఉంచుకోవాలి,” అని గంగూలీ తెలిపారు.
అదే సమయంలో జట్టులోని ప్రస్తుత బ్యాటింగ్ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. “సెలెక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ప్రాథమికంగా, అన్ని స్థానాలు దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి. ఇద్దరు ఓపెనర్లు, గిల్ నాలుగు, పంత్ ఐదు, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ దశలో ధ్రువ్ జురేల్ కోసం స్లాట్ తెరవడం ఎంత సులభమో నాకు తెలియదు. కానీ జురేల్ ప్రదర్శనను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు,” అని పేర్కొన్నారు.
రిషబ్ పంత్ తిరిగి రావడంతో టీమ్ ఇండియా వికెట్‌కీపర్ స్లాట్‌లో పోటీ మరింత కఠినమైంది. పంత్ అనుభవం, టెస్ట్ స్పెషలిటీ ఒక వైపు ఉంటే, జురేల్ ఫామ్, కట్టుదిట్టమైన బ్యాటింగ్ మరో వైపు నిలిచాయి. జురేల్ ఫామ్ కారణంగా సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లు బెంచ్‌కు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలైంది. సాయి సుదర్శన్ నంబర్ 3లో రాణించకపోవడంతో, ఆ స్థానంలో జురేల్‌కు అవకాశం ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. గంగూలీ ఈ విషయంపై మాట్లాడుతూ.. “ జురేల్ ప్యాషన్, కంటిన్యువిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి సెలక్టర్లు 3వ స్థానంలో సాయి సుదర్శన్‌తో వెళ్లాలనుకుంటున్నారా లేదా ఫామ్‌లో ఉన్న ధ్రువ్‌ని తీసుకురావాలనుకుంటున్నారా అనేది చూడాలి“ అని పేర్కొన్నాయి. మొత్తానికి పంత్‌తో పాటు జురేల్ కు సైతం తుది జట్టులో అవకాశం కల్పించాలని గుంగూలీ సజెషన్ ఇచ్చారు.


