కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో శుక్రవారం చోటుచేసుకున్న విద్యార్థుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవినాష్ కాలేజీకి చెందిన రెండు గ్యాంగులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. కర్రలు, రాడ్లు, రాళ్లతో జరిగిన ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
స్థానికులు ప్రకారం.. ఈ కాలేజీ విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ సమీపంలోని రహదారులపై భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనపై మొత్తం 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విద్యార్థుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరికొందరు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా కాలేజీ యాజమాన్యానికి పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.


