అధిక లాభాల మాయలో కోట్ల రూపాయల దోపిడి ముఠా అరెస్ట్..
అధిక లాభం ఆశతో పెట్టుబడి పెడితే నష్ట పోవాల్సిందే.. పోలీసులు హెచ్చరిక..
కాకతీయ, వరంగల్ బ్యూరో :
జనగాం జిల్లా పాలకుర్తి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కోట్లలో ప్రజల డబ్బు మోసం చేసిన నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య పేరుతో హెబ్సిబా అనే సంస్థను 2023లో ఏర్పాటు చేసి, 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి చీటీ వ్యాపారం ప్రారంభించాడు. ముందుగా సభ్యుల నుంచి 6 వేల రూపాయలు వసూలు చేసి, కేవలం 300 రూపాయల విలువ గల వస్తువులను 2 వేల విలువగా చూపించి అందజేశాడు. మిగతా డబ్బును లాభం పేరుతో తిరిగి చెల్లిస్తానని నమ్మబలికాడు. ఈ ముఠా గ్రామాల వారీగా ఏజెంట్లను నియమించి, ఇప్పటి వరకు 28,493 సభ్యత్వాలు నమోదు చేసి, ఒక్కొక్కరికి 4 వేల రూపాయల చొప్పున వసూలు చేసి మొత్తం రూ. 11 కోట్ల 39 లక్షలు సేకరించింది. అందులో వస్తువుల పేరుతో కేవలం రూ. 4 కోట్ల 84 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్నవి..
రూ. 5,92,000 నగదు, 684.5 గ్రాముల బంగారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మెషిన్, చెక్ బుక్స్, స్టాంపులు, పొలాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు అలాగే నిందితులు వసూలు చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లు గుర్తించి, రూ. 5 కోట్ల 48 లక్షలు రూపాయలకు పైగా ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
అరెస్టైన నిందితులు..
ప్రస్తుతం పాలకుర్తి లో నివాసం ఉంటున్న, సూర్యాపేట జిల్లా కు చెందిన తెప్పాలి సైదులు,
మనుబోతుల రామకృష్ణ, పొడిల సురేష్‌కుమార్, పొడిల శ్రీధర్ లను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిపై గతంలోనే పది కి పైగా మోసం కేసులు ఉన్నాయని. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల డబ్బును దోచుకునే బోగస్ కంపెనీలకు బలి కావద్దని, పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు.
పలుసెక్షన్స్ లో కేసు నమోదు..
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నం.216/2025 కింద మోసం కేసు కింద నమోదు అయింది. ఇందులో బీ ఎన్ ఎస్ చట్టంలోని సెక్షన్లు 318(4), 316(2), 316(5) r/w 61(2) తో పాటు, ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం–1978లోని సెక్షన్ 3, 4, 5 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం–1999లోని సెక్షన్ 5ను కూడా అమలులోకి తెచ్చారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు సేకరించి మోసం చేసిన వ్యక్తులపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ప్రతిభ కనబరిచిన అధికారులు..
ఈ ఆపరేషన్‌లో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నర్సయ్య, మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ పవన్, పాలకుర్తి సిఐ జానకీరాం రెడ్డి, ఎస్‌ఐలు వంశీ కృష్ణ, దిలీప్ తదితరుల కృషిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.


