నకిలీ ఏసీబీ అధికారి అరెస్టు
ప్రధాన నిందితుడి రాచంపల్లి శ్రీనివాస్‌పై రెండు రాష్ట్రాల్లో 50 కేసులు
2002 నుంచి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, దోపిడీ కేసులు
కొన్నేళ్లుగా ఏసీబీ డీఎస్పీగా చెలామని అవుతూ అధికారులకు బెదిరింపులు
కేసు నుంచి తప్పించాలంటే డబ్బులివ్వాలని డిమాండ్
మొత్తం 9మందితో ముఠాగా ఏర్పడి నేరాలు
వరంగల్ ఆర్టీఏ అధికారి ఫిర్యాదుతో వరంగల్ పోలీసుల వేట
ఎట్టకేలకు చిక్కిన గజ దొంగ.. ఆయనతో పాటు మరో నలుగురి అరెస్టు
బయటపడిన 20 ఏళ్ల నేర చరిత్ర
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏసీబీ అధికారిగా చెలామణి అవుతూ.. అధికారుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న రాంచపల్లి శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిని సోమవారం వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ వలకు రాచంపల్లి ముఠాలోని ఐదుగురు చిక్కగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను (45 సం., పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్). అతనితో కలిసి నవీన్ జేఆర్ (కర్ణాటక), మంగళ రవీందర్ (బెంగుళూరు), మురళి (బెంగుళూరు), ఎస్.ఎన్. ప్రసన్న (బెంగుళూరు) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సూర్యప్రకాశ్, తాటిమద్ది వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సీనియర్ అధికారులను టార్గెట్ చేసుకుని, మీ మీద అవినీతి కేసు నమోదైంది, బయటపడాలంటే డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఏబీబీ డీఎస్పీగా చెలామణి అవుతూ బెదిరింపులకు పాల్పడేవాడని అన్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆర్టీఏలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డి నుంచి వివిధ మార్గాల్లో 10 లక్షల రూపాయలు దోచుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నికల్ సాక్ష్యాలను సేకరించి.. టెక్నాలజీ సాయంతో ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో రాచంపల్లి శ్రీనివాస్ నేరాలన్ని బయటకు వచ్చాయి. శ్రీనివాస్ నేర చరిత్ర 2002లో ద్విచక్ర వాహన దొంగతనాలతో ప్రారంభమైందని, ఆ తర్వాత నకిలీ పోలీస్ అధికారిగా రాయలసీమలో నేరాలకు పాల్పడి, దొంగల కుటుంబాలను బెదిరించి బంగారం, డబ్బు దోచుకోవడం వంటి కేసుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం 50కిపైగా కేసులు అతని పేరుతో నమైదనట్లు తెలిపారు. జైలు శిక్షలు అనుభవించినా, బయటికి వచ్చిన తర్వాత మళ్లీ కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో 41 చైన్ స్నాచింగ్స్ కు పాల్పడినట్లు తెలిపారు. నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తిన తరువాత ఇప్పటివరకు 19 కేసులు, రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేశాడని తెలిపారు. తెలంగాణలో 9 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 కేసులు నమోదయ్యాయి. అందులో 8 కేసుల్లో అరెస్టయ్యాడు. 11 కేసుల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. దోచిన డబ్బును నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్, గోవా కాసినోలు, బెంగుళూరు-గోవా వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ ఎన్.శుభం ప్రకాష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్, ఇన్స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్‌ఐలు ఎస్. మహేష్, ఎం. సురేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.



