ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలి: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తి భావంతో నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసి కమిషనర్, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్ద లతో కలిసి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గణేష్ మండపాలకు విద్యుత్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలని, పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే మండపాలు వివాదాస్పద ప్రదేశాల్లో ఏర్పాటు చేయరాదని, డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో భక్తి గీతాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, మతసామరస్యానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో 12 నిమజ్జన ప్రదేశాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, క్రేన్లు, ఈతగాళ్లను ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద సహా అన్ని ప్రదేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని చెప్పారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలోని 35 చెరువుల వద్ద ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని తెలిపారు. జీడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. నిమజ్జన ప్రదేశాల వద్ద శానిటేషన్, తాగునీటి సౌకర్యం, హైమాస్ట్ లైట్లు, క్రేన్ల వంటి ఏర్పాట్ల కోసం రూ.18 లక్షలు కేటాయించామని వివరించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


