రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్
కాకతీయ, రాయపర్తి : మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన గారె గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు, కోశాధికారి చిలంచర్ల సతీష్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, రైస్ మిల్లులు కేవలం యంత్రాల సమూహం కాదని, రైతన్న కష్టాన్ని ఫలంగా మార్చే సంపద భాండాగారాలని వ్యాఖ్యానించారు. రైతుల కళ్లలో ఆనందం నింపడమే రైస్ మిల్లర్ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఈసీ మెంబర్‌గా ఎన్నుకున్న పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసోసియేషన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నిక అనంతరం మండల కేంద్రానికి చెందిన పలువురు గణేష్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.


