పేద ప్రజల గుండెచప్పుడు గండు ఐలయ్య గౌడ్
కాకతీయ, ఇనుగుర్తి: పేద ప్రజల హృదయాలను గెలిచి బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి గండు ఐలయ్య అని పిఎసిఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న అన్నారు. మంగళవారం ఐలయ్య వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని చిన్న బస్టాండులో గల ఐలయ్య విగ్రహానికి వివిధ గ్రామాల ప్రజలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ఉద్యమ సారథి గండు ఐలయ్య అని, ఇనుగుర్తిలో ఆ రోజుల్లోనే జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ఎస్సీ సంక్షేమ వసతి గృహం, గ్రామపంచాయతీ ఆఫీసు, గ్రంథాలయం, దాదాపు 20 కి పైగా మంచినీటి బావులు తవ్వించడమే కాకుండా మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారని గుర్తుచేశారు. గౌడ కులస్తులందరినీ ఏకం చేసి సొసైటీలు ఏర్పాటు చేశారని, భూస్వాములకు వ్యతిరేకంగా బలహీన వర్గాల కోసం పోరాటం చేసి పేదలకు, దళితులకు భూములు పంచారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాటోతు హరిచంద్ నాయక్, రిటైర్డ్ టీచర్ సట్ల మల్లయ్య, రాయిలి ఉప్పలయ్య, ఉమ్మగాని మల్లయ్య, గుజ్జునూరి వెంకన్న, కందునూరి వెంకన్న, బొల్లోజు చంద్రయ్య చారి తదితరులు పాల్గొన్నారు.


