గండ్ర వర్సెస్ గండ్ర
సమీప భవిష్యత్‌లోనే భూపాలపల్లి మునిసిపాలిటీ ఎన్నికలు
నగర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు ఇద్దరికి ప్రతిష్ఠాత్మకమే
పట్టు నిలుపుకునేందుకు రమణారెడ్డి యత్నం
పవర్ ప్లే చేసేందుకు సత్యనారాయణరావు సన్నద్ధం
ఎమ్మెల్యేపై క్రమంగా పెరుగుతున్న నెగటివ్ కామెంట్లు
పర్యటనలతో జోరు పెంచుతున్న మాజీ ఎమ్మెల్యే
అభివృద్ధి గళం విప్పుతున్న ఎమ్మెల్యే.. అనుచరులు
కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత కలహాలు.. అసంతృప్తి
ప్రతిపక్షానికి బలంగా మారే అవకాశం
జనంలో ఇద్దరిపైనా మిక్స్డ్ టాక్..!
కాకతీయ, భూపాలపల్లి : సమీప భవిష్యత్‌లో జరగనున్న భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు నగర రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేయనున్నాయి. ఈ ఎన్నికలు గండ్ర కుటుంబంలోనే రాజకీయ పోరును తెరపైకి తీసుకొచ్చాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి… ఇద్దరికీ ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందుకే ఇది కేవలం మునిసిపల్ ఎన్నిక కాదు.. ‘గండ్ర వర్సెస్ గండ్ర’గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. పురపాలక సంఘాలకు 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 10న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో, సంక్రాంతికి ముందే మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భూపాలపల్లి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే
అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మునిసిపాలిటీపై పట్టు నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుకూల ఫలితాలు సాధించడాన్ని ఆయనలో నమ్మకం పెంచిన అంశంగా చెబుతున్నారు. సుమారు 18 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, అదే ఊపును మునిసిపాలిటీ ఎన్నికల్లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వర్గం అభివృద్ధినే ప్రధాన అజెండాగా తీసుకొస్తోంది. “నగరంలో జరుగుతున్న పనులే మా ప్రచారం” అన్నట్లుగా అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేపై నెగటివ్ కామెంట్లు క్రమంగా పెరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం, పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం తగ్గిందన్న అసంతృప్తి కాంగ్రెస్‌లోనే వినిపిస్తోంది.

స్పీడ్ పెంచిన మాజీ ఎమ్మెల్యే..!
మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మళ్లీ రాజకీయంగా పట్టు సాధించేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల తరచూ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ తన ఉనికిని చాటుతున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పసిగడుతూనే రాజకీయ చతురతను రమణారెడ్డి ప్రదర్శిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. “మునిసిపాలిటీ ఎన్నికలే రాజకీయ బలాన్ని పెంచుకునే అవకాశ మార్గం” అన్నట్టుగా ఆయన వ్యూహాలు సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో భూపాలపల్లి మునిసిపాలిటీపై పట్టు ఉన్న బీఆర్ఎస్కి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత కలహాలు తమకు కలిసొస్తాయని భావిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ పెంచుకునే లక్ష్యంతో కదులుతోంది.
కాంగ్రెస్‌లో కలహాలు.. ప్రతిపక్షానికి ఛాన్స్?
భూపాలపల్లి కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి రోజురోజుకీ బయటపడుతోంది. టికెట్ల పంపకం, నాయకత్వ పాత్రపై విభేదాలు పెరిగితే ప్రతిపక్షాలకు ఇది బలంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ, వార్డుల విభజన, కొత్త ఓటర్ల నమోదు ఫలితాలపై కీలక ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. నగర ప్రజల్లో మాత్రం ఇద్దరు గండ్రలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి గళం వినిపిస్తుండగా, మరోవైపు అసంతృప్తి స్వరం కూడా వినిపిస్తోంది. అభివృద్ధి పనుల పెండింగ్, మౌలిక సదుపాయాల లేమి, సంక్షేమ పథకాల అమలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. భూపాలపల్లి మునిసిపాలిటీ ఎన్నికలు ఎవరి రాజకీయ భవిష్యత్తుకు దారి చూపుతాయో, ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం… ఈ ఎన్నికలు ‘గండ్ర వర్సెస్ గండ్ర’గా భూపాలపల్లి రాజకీయాల్లో హై వోల్టేజ్ డ్రామాకు తెరలేపనున్నాయి.


