కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గండి రామారం (మల్లన్నగండి) రిజర్వాయర్ నుండి రూ.29 కోట్లతో నిర్మించిన కుడి కాలువను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగు నీటిని విడుదల చేశారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం వల్ల ఎడారి వలె ఉన్న జనగామ నేడు అధిక వరి ఉత్పత్తి చేసే జిల్లాగా మారిందని, అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.
ఇప్పటివరకు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి 800 కోట్ల నిధులు కేటాయించడంలో కడియం శ్రీహరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కుడి కాలువ ద్వారా 5,600 ఎకరాలకు సాగు నీరు అందనుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరు అందేలా కృషి చేస్తున్నానని అన్నారు. గత ఏడాదిన్నరలోనే నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు తెచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


