గంభీర్ శిక్షణకు పరీక్ష
టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు
ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు
కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ పోస్టులు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : టాలెంటెడ్ ఆటగాళ్లు, ఎంతో అనుభవం ఉన్న సీనియర్లతో కళకళలాడే భారత జట్టుకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమ్ఇండియా ఊహించని రీతిలో ఘోరమైన ఓటములను చవిచూస్తోంది. మొన్న ఆదివారం ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోవడమే దీనికి నిదర్శనం. విరాట్ కోహ్లీ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. గంభీర్ హయాంలో భారత్ ఎదుర్కొన్న 5 చేదు జ్ఞాపకాలు అభిమానులను వెంటాడుతున్నాయి.
చరిత్రలోనే మొదటిసారి..
టీమ్ఇండియా చరిత్రలోనే న్యూజిలాండ్ జట్టు మన దేశానికి వచ్చి వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1988 నుంచి 2023 వరకు కివీస్ టీమ్ భారత్‌లో ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే ఏడింటిలోనూ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం వారు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని గంభీర్ కోచింగ్‌లో భారత్‌కు మొదటి దారుణమైన పరాభవాన్ని మిగిల్చారు. అసలు ఇలాంటి రీతిలో సిరీస్ చేజారుతుందని ఎవరూ ఊహించలేదు. జట్టు మంచి ఫామ్‌లో ఉన్నట్లు అనిపిస్తున్నా ఫలితం మాత్రం దారుణంగా ఉంటోంది.
టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్
నవంబర్ 2024లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. కనీసం మూడు మ్యాచులు ఉన్న టెస్ట్ సిరీస్‌లో భారత్ తన సొంత గడ్డపై వైట్‌వాష్ అవ్వడం ఇదే తొలిసారి. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అవ్వడం కూడా గంభీర్ హయాంలోనే జరిగింది. టాప్ ప్లేయర్స్ అందరూ ఒకేసారి ఫామ్ కోల్పోవడం కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటింగ్ లైనప్‌లో క్లారిటీ లేకపోవడం ఈ పరాభవానికి ప్రధాన కారణమని కొందరు సీనియర్లు కామెంట్ చేశారు.
శ్రీలంకతో 27 ఏళ్ల తర్వాత సిరీస్ ఓటమి
ఆగస్టు 2024లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-0తో కోల్పోయింది. గత 27 ఏళ్లలో శ్రీలంక చేతిలో భారత్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1997లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన భారత్, ఆ తర్వాత వరుసగా 13 సిరీస్‌లలో ఓటమి లేకుండా దూసుకుపోయింది. కానీ గంభీర్ రాకతో ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. శ్రీలంక ఇతర చిన్న జట్లతో ఓడిపోతున్న సమయంలో భారత్‌ను ఓడించడం పెద్ద షాక్ అనే చెప్పాలి. 2024-25 లో గంభీర్ కోచింగ్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ 3-1తో సిరీస్‌ను కోల్పోయి, పదేళ్ల తర్వాత ట్రోఫీని ప్రత్యర్థికి అప్పగించింది.


