మేడారం మహా జాతరకు నిధుల వరద
ఏకంగా రూ.150 కోట్లు కేటాయింపు
కాకతీయ,ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు (GO.Rt.No.239, తేదీ: 19-08-2025) జారీ అయ్యాయి. పర్యాటకులు, భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చే ఈ జాతరలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, సేవలు అన్నింటికీ సంబంధిత శాఖల్లో శాఖలవారీగా నిధుల కేటాయింపు జరిగింది. ప్రభుత్వం కేటాయించిన నిధులు
సివిల్ వర్క్స్ విభాగం (9087 లక్షలు),పంచాయతీ రాజ్ కు 5130 లక్షలు, రోడ్లు & భవనాల శాఖకు 995 లక్షలు, ఇరిగేషన్ & సి ఎ డి డికు 590 లక్షలు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ కు 857 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా & శానిటేషన్కి 1515 లక్షలు కేటాయించారు. నాన్-సివిల్ వర్క్స్ విభాగం (5913 లక్షలు)
పోలీస్ శాఖకు భారీగా 1450 లక్షలు, రెవెన్యూ శాఖకు 1438.15 లక్షలు, జిల్లా పంచాయతీ అధికారి – 1162 లక్షలు, మెడికల్ & హెల్త్ – 107 లక్షలు, టిఎస్ఆర్టిసి కి – 500 లక్షలు (ప్రత్యేక బస్సులు), విద్యుత్ సరఫరా – 500 లక్షలు, అటవీ, ఎక్సైజ్, ఫిషరీస్, మహిళా & శిశు సంక్షేమం, వెటర్నరీ తదితర శాఖలకు వేర్వేరుగా నిధుల కేటాయింపు జరిగింది.

భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా..!
మేడారం మహా జాతర 2026 కు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాతరకు హాజరవుతున్న ఒక కోట్లకు పైగా భక్తులందరికీ త్రాగునీరు, శానిటేషన్, రహదారులు, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలలో ఇబ్బంది కలగకుండా ఈ భారీ వనరులు వినియోగించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు..
మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో కొత్త రహదారులు, వంతెనలు, విస్తరణ పనులు ప్రధాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు, శాశ్వత నీటి వసతి, వివిధ చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, అదనపు పోలీస్ బలగాల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర వైద్యకేంద్రాలు, తాత్కాలిక హాస్పిటల్ క్యాంపులు, టి ఎస్ ఆర్ టి సి ప్రత్యేక బస్సుల సేవలు, రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


