గ్రామీణ మెడికల్ కాలేజీలకు నిధులివ్వాలి
పార్లమెంట్‌లో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యను బలోపేతం చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, అధ్యాపకులు, వైద్య పరికరాలు, హాస్టళ్లు, ల్యాబ్స్, డయాగ్నస్టిక్ టూల్స్ వంటి సదుపాయాలపై విస్తృతంగా వివరణ కోరారు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు 2023 నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అమలవుతోందని, అధ్యాపకుల హాజరును ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రూ. 67.16 కోట్లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ. 208.82 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే, తెలంగాణలోని 9 మెడికల్ కళాశాలలకు మొత్తం 511 పీజీ సీట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌కు 92 సీట్లు కేటాయించగా, మొదటి దశలో 89 సీట్లకు రూ. 7.47 కోట్లు, రెండో దశలో మిగిలిన 3 సీట్లకు రూ. 2.15 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సిబ్బంది కొరత ఉండకుండా చూడాలని, మెరుగైన వైద్య సేవలకై మరిన్ని నిధులను కేటాయించాలని ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.


