- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
- ఎన్నికల హామీలపై బాకీ కార్డ్ విడుదల
- నియోజకవర్గ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బాకీ కార్డ్స్ పంపిణీ
కాకతీయ, నర్సంపేట : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేరుస్తామని ప్రజలకు చెప్పి మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 700 రోజులు గడిచినా ఇప్పటివరకు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు బాకీ పడిందని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రైతులను, రైతు కూలీలను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందన్నారు.
రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదని, రైతు భరోసాను, వడ్లకు బోనస్ ఎగొట్టిందని, ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో రైతులు, మహిళలలు, చిన్నపిల్లలు నెలల తరబడి క్యూ లైన్ లో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ఎలాంటి చరణం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి ఆరు గ్యారంటీల పేరుతో చేసిన మోసాలను అమలు చేయని హామీలను ప్రతీ ఇంటికి వివరిస్తూ బాకీ కార్డులను రెండు రోజులలో నియోజకవర్గంలో పంపిణీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సుదర్శన్ రెడ్డి సూచించారు.


