వనం నుంచి జనంలోకి ..
గద్దెలపైకి సారలమ్మ
ఘనంగా గరీబ్ పేట జాతర
అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
కాకతీయ ,కొత్తగూడెం రూరల్: మేడారం సమ్మక్క-సారలక్కల జాతరను పురస్కరించుకొని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పరిధిలోని గరీంపేట గ్రామంలో ఉన్న మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం గిరిజనుల కొంగుబంగారమైన సారాలమ్మను వనం నుంచి జన ప్రవేశం చేసేందుకు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో విశిష్ట పూజలను ఆచరించి చిలకలగుట్ట నుంచి దేవాలయానికి తీసుకువచ్చారు. జాతరకు తొలి ఘట్టమైన సారలమ్మ వనం నుంచి జనంలోకి తరలివచ్చే కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు హాజరై పూజలను ఆచరించారు. గురువారం సమ్మక్కను జన ప్రవేశం చేసేందుకు సాంప్రదాయ పద్ధతిలో పూజలను సిద్ధం చేశారు. మూడు రోజులు పాటు జరిగే ఈ జాతరను తొలి ఘట్టం పూర్తికావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు.



