కాకతీయ, నర్సంపేట: ఏజెన్సీ మండలాల్లో వన్యప్రాణుల మాంస విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని వేటగాళ్లు వన్యప్రాణుల వేట మాంస విక్రయల దందా జోరుగా చేస్తున్నారు.
సోమవారం మధ్యాహ్న కొత్తపల్లి నుంచి కొత్తగూడ వైపులో అడవి పంది మాంసం టూ వీలర్ పై తరలిస్తుండగా ఆ మాసం క్యాన్ నుంచి మట్టి రోడ్డుపై జారిపడింది. దీంతో మాంసం రవాణా జరుగుతుందనే విషయం వెలుగులోకి వచ్చింది. అది తరలిస్తున్న ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన చింతం సత్యం ను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
గతంలో కూడా చిలుకమ్మనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో, పొగళ్లపల్లి క్రాస్ వద్ద జరిగిన ప్రమాదాల్లో పట్టుకున్నారే తప్పా నేరుగా వన్య ప్రాణుల వేటకు వెళ్లే వారిని అధికారులు గుర్తించి పట్టుకోలేదనే ప్రచారం మండలంలో జోరుగా సాగుతుంది. ఇకనైనా వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.


