పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం
కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ పట్టణంలోని కట్టారాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిపుణుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గైనకాలజీ, దంత వైద్యం, జనరల్ మెడిసిన్, శిశు వైద్యం, ఆర్థోపెడిక్, కంటి వైద్య విభాగాలకు చెందిన నిపుణులు రోగులను పరీక్షించి తగిన వైద్య సూచనలు అందించారు. అవసరమైన వారికి రక్తపరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్ రేణుక శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటమణ, పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ సనా, కట్టారాంపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ నవ్య, డాక్టర్ ప్రణీత తదితరులు పాల్గొన్నారు.


