బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా
వేములవాడలో ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : బాలికల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో 14 సంవత్సరాల బాలికలకు టీకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ టీకా కీలకమని చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కన్నా ముందుగానే టీకా వేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. మహిళల సాధికారత, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14 సంవత్సరాల వయస్సు గల 3,773 మంది బాలికలకు ఈ టీకాలు అందించనున్నట్లు తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


