50 కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు జూలూరుపాడు మండలంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా రమేష్ మాట్లాడుతూ, మండల పరిధిలోని పడమట నర్సాపురం, దండుమిట్ట తండా, కొమ్ముగూడెం, బేతలపాడు, మచినేనిపేట గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలకు ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. పేద కుటుంబాలకు పొగరహిత వంటక గృహాలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రామారావు, యువమోర్చ అధ్యక్షుడు రాంబాబు, ఉపాధ్యక్షుడు బాలకిషన్, కార్యదర్శి బాబూలాల్, సోషల్ మీడియా కన్వీనర్ చరణ్, పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు.


