పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు
శంకరా నేత్ర వైద్యశాల, రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం
54వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి భారీ స్పందన
500మందికి కంటి పరీక్షలు.. శస్త్రచికిత్సలకు 50 మంది ఎంపిక
ఔషధాలు, కళ్లద్దాలు పంపిణీ
రుద్ర ఫౌండేషన్ సేవలను కొనసాగిస్తాం : పేరం గోపికృష్ణ
కాకతీయ, హనుమకొండ : పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో హనుమకొండలో నిర్వహించిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన కంటి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో హనుమకొండలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో, రుద్ర ఫౌండేషన్ సహకారంతో ఈ వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు.
హన్మకొండలోని 54వ డివిజన్ మైసమ్మ గుడి లైన్‌లో హనుమాన్ గుడి ఎదుట ఉన్న పీవీఆర్ రెసిడెన్సీలో జరిగిన ఈ నేత్ర శిబిరానికి సుమారు 500 మంది వృద్ధులు, మహిలు, చిన్నారులు పరీక్షలకు హాజరయ్యారు. సుమారు మరో 50 మంది శస్త్ర చికిత్సలకు ఎంపికయ్యారు. 50 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు హాజరై ప్రజలకు కంటి సంబంధిత పలు పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి చూపు పరీక్షలు, ముత్యబిందు నిర్ధారణ, రెటీనా పరీక్షలు నిర్వహించి రోగులకు తగిన వైద్య సలహాలు అందించారు.
శస్త్ర చికిత్సలకు ఎంపికైన పేద రోగులకు హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు రుద్రా ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ తెలిపారు. శస్త్రచికిత్సతో పాటు ఐఓఎల్ లెన్స్ అమరిక, భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. అలాగే శిబిరానికి వచ్చిన అర్హులైన రోగులకు ఉచితంగా మందులు, కళ్లద్దాలు కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమయానికి కంటి పరీక్షలు చేయించుకుంటే అనేక సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించేందుకు రుద్ర ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, జ్యోతి, రమణాచారి, రాజ్ కుమార్, రాజు, క్రాంతి, వీరచారి, రాము, విక్రమ్, వివేక్, అభిషేక్, అరుణ్, నాగరాజు, స్రవంతి, ఇందు, దీపిక, శ్రావ్య, వెంకన్న, రామకృష్ణ, తిరుపతి, సంపత్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.



