వందమందికి ఉచిత కంటి వైద్య శిబిరం
కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరత్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో వందమందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పలువురు వాకర్స్, స్థానిక ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని సేవలను పొందారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఏకైక క్రీడా మైదానం ఎన్టీఆర్ స్టేడియమని, దీనిని మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. నూతన పాలకవర్గం కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు పేరుతో ఏర్పడిన ఈ సంఘం ఆరోగ్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుందని అన్నారు. స్టేడియంలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులను అసోసియేషన్ బాధ్యులు సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


