అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం
నిందితుడి అరెస్ట్
కాకతీయ, హనుమకొండ : ముందస్తు అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జూబ్లీ ఎంక్లేవ్ ప్రాంతంలో ఉన్న బాలాజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థను నిందితుడు సోలిపేట ప్రభాకర్ రెడ్డి 2018లో 68 శాతం వాటాతో కొనుగోలు చేశాడు. మరో 32 శాతం వాటాతో కోడూరు లక్ష్మి అనే మహిళ అతనితో భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. నిందితులు గుండ్ల పోచంపల్లి ప్రాంతంలో ఎస్‌వీబీ వైభవ్ అనే ప్రాజెక్ట్ పేరుతో ఏడు అంతస్తుల భవనంలో మొత్తం 164 అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని ప్రజలను నమ్మబలికి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండలోని ఏనుగులగడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ అనే మహిళను కూడా నిందితులు మోసం చేసినట్లు వెల్లడించారు. ఆమెకు రెండు అపార్ట్‌మెంట్‌లు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ముందస్తు బుకింగ్ పేరుతో సుమారు రూ.81 లక్షలు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించకుండా మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో నిందితుడు సోలిపేట ప్రభాకర్ రెడ్డి మోసానికి పాల్పడినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


