నకిలీ బంగారంతో నగల దుకాణంలో మోసం
జమ్మికుంటలో రూ.70 వేల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దుండగులు
కాకతీయ, జమ్మికుంట: కస్టమర్ల వేషంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారం ఇచ్చి కొత్త నగలు తీసుకెళ్లిన ఘటన జమ్మికుంట పట్టణంలో జరిగింది. స్థానిక నగల వ్యాపారి విజయగిరి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల ఆరు తేదీన ఉదయం దుకాణానికి వచ్చిన ఒక మహిళ, ఒక పురుషుడు తమ వద్ద ఉన్న బ్రాస్లెట్, గొలుసును చూపిస్తూ వాటిని మార్పిడి చేసి కొత్త నగలు ఇవ్వాలని కోరారు. వాటిని నిజమైనవేనని నమ్మిన యజమాని 23.8 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. వారు వెళ్లిన తర్వాత పరిశీలించగా ఇచ్చిన నగలు నకిలీగా తేలాయి. దుకాణంలోని చిత్రాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


