గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్
కాకతీయ, గీసుగొండ: జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామానికి చెందిన భోగి నవీణ్, రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కటకం కళ్యాణ్ అలియాస్ పాల్ దినాకర్, గీసుగొండ మండల స్థంభంపల్లి గ్రామానికి చెందిన బెంబిరె అరవింద్, బెంబిరె మహేష్ అనే నలుగురు యువకులు గంజాయి, మద్యం జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కలిసి హైదరాబాదు దూల్‌పేట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి సుమారు 145 గ్రాముల ఎండు గంజాయి కొనుగోలు చేశారు.ఆ గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు ధర్మారం గ్రామంలోని ఊర చెరువు సమీపంలో సంచరిస్తుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న గీసుగొండ పోలీస్ సిబ్బంది వారిని పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వాడకం, రవాణా లేదా నిల్వ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో నూ ఉపేక్షించబోమని హెచ్చరించిన సీఐ,మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


